Friday, April 24, 2009

మనోహరి మాయ

కౌన్తేయునికి వాసుదేవుడు భగవద్గీత ఎంత చక్కగా బోధించాడో చూడలేదు కాని మా సీనియర్ మాత్రం మనోహరి దయ వల్ల నాకు అంతటి భాగ్యమే కల్పించాడు. అంతటి మహద్భాగ్యం నాకు లభించేటట్టు చేసిన మనోహరికి ఏమి ఇచ్చినా సరిపోదు.

కానీ రోజు రాత్రి మాత్రం తను ఎలా ఉండవచ్చో అనే ఊహలు. మహా అయితే తనని వెనుక నుంచి ఇరవై సెకెన్లు కూడా చూసుండను. ఆయినా కొంత లీలగా గుర్తు వస్తుంది. తన నల్లని జుట్టు ఒత్తుగా ఉండి, చక్కగా రెండు పిన్నులు మధ్య ఒక జలపాతం. నల్లని జాలపాతంపై రవికిరణాభరణాలు వల్ల మెరుస్తున్నాయా అనేట్టు తెల్లని జాజిమల్లెలు. జాజిపూల సువాసనలు ఎంతటి వారినయినా ముగ్ధమనోహరులను చేస్తుంది. అలాంటిది మనోహరి జడలోని జాజులు మత్తెక్కించేయవూ. మత్తులో ఇంకొన్ని క్షణాలు అయినా ఉంటే ఎంత బాగుంటుంది కదా. చివరిలో రబ్బరుబాండు వేసుకుంది కానీ లేకపోతె కేరళకుట్టిలాగా ఇంకా బాగుండేదేమో. పాపం తనని ఎంత విమర్శించానో! అయినా నేను అస్సలు తెలియకపోయినా, నన్ను పెళ్లి చేసుకుంటానంది. ఎంత పిచ్చిది బందరు ముద్దుగుమ్మ! ఏంటో తనని ఒక్కసారయినా కలవాలనే ఆలోచనలు. ఆలోచనల నడుమ నెమ్మదిగా నిద్రలోకి జారుకున్నాను.

ప్రొద్దున్నే కాలేజికి వెళ్లి నా మనస్సుని హరించిన ముగ్దమనోహరి కోసం వెతికా. విచిత్రం ఏమిటంటే అసలు మనోహరి అనే పేరుగల అమ్మాయే లేదని తెలిసింది. మాయా మనోహరి నన్ను మాయ చేసి మాయం అయిపోయింది. ఇప్పుడు మళ్లీ అర్థమైంది తను కాదు పిచ్చిది. పిచ్చివారు ఎవరో నా నోటితో మరీ విడమరిచి నేను చెప్పలేనులేండి. మీకు మాత్రం అర్థం అవుతుంది కదా!

Thursday, April 16, 2009

మనోహరి - నా పని అయ్యింది హరి

బస్సులో రాయి పోయిందే అని అనుకునే లోపే దేవుడు ఇంకో విషమ సంకటం తెచ్చిపెట్టాడు. మా తరగతి లోని అమ్మాయిల లిస్టు తయారు చేయమన్నారు మా సీనియర్స. లిస్టు అంటే అలాంటిది ఇలాంటిది కాదండి, సుమారు ఇరవయి దాక పర్సనల్ విషయాల గురించి ఉన్నాయండి.

వాళ్ల పేరు, ఊరు, పుట్టిన తేది (వయసు అడగకూడదనేమో), ర్యాంకుల (తెలివైన అమ్మాయా కాదా) తో మొదలు పెట్టారు. అంత దాక బానే ఉంది. వాళ్లకి ఇష్టమయిన హీరో, హీరోయిన్ (టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్). ఇంతలో మన బుర్రకు ఒక సందేహం కలిగింది. సర్, వాళ్లు నా లాగ ఇంగ్లీష్ సినిమాలు చూడకపోతే ఎలా తెలుస్తుంది అని అడిగా. అంతే రేపు నువ్వు ఒక మంచి ఇంగ్లీష్ సినిమా చూసి ఆ కధ చెప్పు అన్నారు. ఇంతలో ఆ వద్దు లే రాసుకొని తీసుకురా అని మళ్ళీ మొదలు పెట్టారు.

వాళ్లు వాడే కాటుక, పౌడర్ బ్రాండ్స , చివరికి వాళ్లు వాడుకునే సబ్బుల గురించి కూడా తెలుసుకోమన్నారు. నాకు ఇవన్నీ సుద్ద దండగ అనిపించింది. అవి తెలుసుకుని ఏమి చేసుకుంటారు చెప్పండి. ఇంతలొ వాళ్ళ హాబీస్ గురించి, వాళ్ళకి ఇష్టమయిన ఆటలూ (ఏముంటాయిలెండి కోతి కొమ్మఛి, తొక్కుడు బిళ్ళ, కళ్ళకు గంతలు), పుస్తకాలు గురించి అడిగారు. ఇంకా తనని పెళ్లి చేసుకోబోయే వాడు ఎలా ఉండాలి, దానికి నేను సరిపోతానా లేదా, దానికి కారణం. అంతా ఒక రకంగా ఓకే కాని ఈ చివరిదే వారి కన్నెర్రకు బలయిపోతానేమో! కాని తప్పదు సాయంత్రానికల్లా తెచ్చివ్వమన్నారు.

ఎంత ధైర్యం తెచ్చుకున్నా సరిపోవట్లేదు. ఎవరికయినా ఇవి అడగాలంటే భయమేస్తుంది కదండీ. అసలే ఇంటర్ లో పుస్తకాలూ, అప్పుడప్పుడు మన క్రికెట్, సినిమాలు తప్ప అమ్మాయిల తో అసలు ఎలా మాట్లాడాలో మర్చిపోయాను. సాయంత్రం అయ్యేకొద్ది పాఠాలు ఎక్కట్లేదు, అమ్మాయిలు మనకు సహకరించడానికి ఏం చేయాలో అని మనసులో ఒక ఆలోచన, ఆవేదన. చివరికి ధైర్యం చేసి పక్క వరస లో ముందు బల్లలో కూర్చున్న అమ్మాయికి ఇచ్చి ఇవి రాసివ్వండి ప్లీజ్, సీనియర్స అడుగుతున్నారు అని చెప్పా. ఏమనుకుందో ఏమో సరే అని ఒప్పేసుకుంది. హుర్రే! ఈ రోజు పిల్లి కాకుండా కుక్క ఎదురొచ్చినట్టు ఉంది; మరీ ఇంత సులభంగా పని అయిపోతున్దే అనిపించింది.


పేరు: మనోహరి (ఆహా మనోహరమయిన పేరు)ఊరు: బందరు (మనలాగే కోతే, పర్లేదు)
ర్యాంకు: 3205 (మనకంటే తెలివయినదే) పుట్టిన తేది: ... (మనకంటే పది నెలలు చిన్నదే
కాటుక: ఐటెక్స్ (షరా మామూలే) పౌడర్: పాండ్స్ (తగ్గరు గా!)
సబ్బు: పియర్స్ (ఎప్పుడూ వినలేదు, చూడలేదు, అసలు ఉందొ లేదో ) రంగు: తెలుపు నలుపు (మనకు ఒకే)
స్వీట్: పాయసం (బందరు లడ్డు కాదా) కూర: వంకాయ (వంకాయా! పద్యం గుర్తు వస్తుంది)
హాబీస్: తపాలా బిళ్ళలు, నాణాలు సేకరణ, పాటలు (పాటలు పాడడమా? వినడమా? ) ఆటలు: క్రికెట్, టెన్నిస్, బ్యాడ్మింటన్ (అమ్మో! ఇంత సీన్ ఉందా)
ఇష్టమైన ప్రదేశం: కాశ్మీర్ లోయలు (మన కృష్ణమ్మ జలాలు పక్కనే ఉన్నాయ్ కదమ్మా ఎంచక్కగా!)
హీరో: నాగార్జున (చిరంజీవి కాదా?) హీరోయిన్: శ్రీదేవి (ఇంక పాత తరం లోనే ఉంది)
మీ వరుని లో ఉండాల్సినవి: మంచితనం, నిజాయితీ, లాలన, చురుకుదనం, తెలివి, అందం, ప్రేమ, గౌరవం, నమ్మకం (అన్ని సంస్కృతంలో బట్టీపట్టింది)
నేను అర్హుడినా (కారణం) : అర్హులే, మీ ధైర్యం. పై వాటి గురించి నాకు తెలియదు (అంటే లేవా! [:(])

ఇవన్నీచూసి సీనియర్ పర్లేదు, అమ్మాయి ఎలా ఉంటుంది అని అడిగాడు. మనకు తెలిస్తే కదా చెప్పడానికి. తన ముఖం లొని కోపం, ఆ కళ్ళలోని ఎర్రదనం ఎక్కడ చూడాల్సి వస్తుదేమో అని తనని చూడకుండానే వివరాలు తీసుకున్నా. ఏమో తెలియదు, చూడలేదు అన్నా. అంతే మనోహరీ! నా పని ఇక హరి!

Friday, March 20, 2009

బస్సు లో ఓ రాయి

బస్సు లో ఇరుకిరుగ్గా ఉంది, ఒంటి కాలి పై నిలబడ్డాను. గాలి ఆడట్లేదు. ఇంతలో కిటికీ వైపు చూసా. కిటికీకి అడ్డంగా ఒక అమ్మాయి కూర్చొని ఉంది. ఆహా ఈ అమ్మాయి భలేగా ఉందే ! పరిచయం చేసుకుంటే భలేగా ఉంటుందే, కానీ ఎలా?

ఎలా ఎలా అనుకునే లోపల, వెనుక నుండి సీనియర్. ఏ నాన్న, జూనియర్ వా నువ్వు . పేరేంటి, ఊరేంటి, అంటు లక్ష ప్రశ్నలు. నా విషయాలు నీకెందుకు నాయినా, కావాలంటే ఆ అమ్మాయిని అడుగు ఈ ప్రశ్నలన్నీ, నేనూ చక్కగా ఆనందంతో వింటా. ఇలా మనసులో విసుగ్గా అనుకునే లోపల ఇంకో సీనియర్ . అబ్బా, అసలే గాలి ఆడట్లేదు, మళ్లీ వీళ్ళ గొడవ ఒకటి. మళ్లీ మొదటి నుంచి అన్నీ అడిగు బాబు!

ఇంతలో అతనికి ఏమయిందో ఏమో, నన్ను వెళ్లి ఆ అమ్మాయి పేరు బయోడేటా కనుక్కొని రమ్మన్నాడు. బయోడేటానా? అంటే ఏమేమి అడగాలి? వీళ్ళని అడిగితే ఇంక నన్ను ఆడుకుంటారు, అడగకపోతే అది, ఇది అడగలేదా అని మళ్లీ పంపిస్తారు. ఇదేదో బాగుండే, అన్నీ అడగకపోతే ఏంటి, మళ్ళి కలవచ్చుగా ఆ అమ్మాయిని. గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళాను.

నేను : మీ పేరు కొంచం చెప్తారాండి?
అమ్మాయి : నా పేరా , నీకెందుకు చెప్పాలి?
నేను : సీనియర్లు అడగమన్నారండి ? చెప్పకపోతే నన్ను ఆడుకుంటారు మరి.
అమ్మాయి : నేను చెప్పను. అతన్నే రమ్మను ధైర్యముంటే.
(నాకా? తనకా? అంత లేదమ్మా నాకు. పేరు చెప్తే ఈ అమ్మాయి సొమ్ము ఏమ్పోతుందో. ఇలా కాదు, నలుగురు సీనియర్ అమ్మాయిలు ర్యాగింగ్ చేస్తే కానీ ఈ అమ్మాయికి ర్యాగింగ్ అంటే తెలియదు)
నేను : ప్లీజ్ అండి , కొంచెం పేరు , ఊరు , బ్రాంచ్ చెప్పండి. నేనూ వెళ్ళిపోతాను.
అమ్మాయి : సరే, పేరు ఐశ్వర్య రాయి , ఊరు మంగళూరు , బ్రాంచ్ మీది కాదు. ఇలాగే చెప్పు అంది.
నేను : ఇలాగే చెప్పేదా అండి , రాయి గారు? కొంచెం అర్థం చేసుకోండి.
రాయి : (నవ్వుకుంటూ) ఆ ఇలానే చెప్పు
నేను : ప్లీజ్ అండి, చెప్పండి మళ్లీ మిమ్మల్ని కుడా ఆడుకుంటారేమో
రాయి : ఆ అప్పుడు చెప్పచ్చులే, ఇక నువ్వు వెళ్లచు.

ఏమి చేసేది లేక తిరుగుముఖం పట్టా. ఓ రాయి, భలే ఉన్నావనుకున్నా , నన్ను ఇలా ఇరికించేసావు కదా! ఈ సీనియర్ మహానుభావులు ఇక ఏంచేస్తారో చూడాలి!

Sunday, March 8, 2009

ఆడువారి దినం

ఈ రోజు ఆడవాళ్ల దినం (Women's Day) అంటండి. సంవత్సరం లో మిగతా రోజులన్నీ మగవారి దినాలేమో మరి. అబ్బాయిలు మీరు అలా అనుకుంటూ తృప్తి పడిపోండిక.

నాకు తెలిసి మహిళలకి అని ఒక దినం పదేళ్ళ ముందు లేదు. మొదట "Ponds" ప్రకటనలలో చూసా. ఒహొ భలే ఉందే, అమ్మాయిలకు దగ్గరవడానికి మంచి కిటుకే అనుకున్నా. అప్పటి నుంచి ప్రతి ఏడాది జరుపుకోవడం మొదలు పెట్టారు.
ఎంత ఆయినా మహిళలు తెలివయిన వారే! వాళ్ళకి కావాల్సిన బహుమతులను కొనిచ్చేసుకోదానికి ఇంకో రోజు దొరికింది. ఈ అంగడి వాళ్లు వారికి తగ్గట్టే స్పెషల్ ఆఫర్స్ అంటు వాళ్ళని మురిపించేస్తారు.

ఏమయితేనేం! ఈ స్త్రీల దినం సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజెస్తూ వారు ఆనందంగా ఉండాలని ఆకాంక్షిదాం.