Friday, March 20, 2009

బస్సు లో ఓ రాయి

బస్సు లో ఇరుకిరుగ్గా ఉంది, ఒంటి కాలి పై నిలబడ్డాను. గాలి ఆడట్లేదు. ఇంతలో కిటికీ వైపు చూసా. కిటికీకి అడ్డంగా ఒక అమ్మాయి కూర్చొని ఉంది. ఆహా ఈ అమ్మాయి భలేగా ఉందే ! పరిచయం చేసుకుంటే భలేగా ఉంటుందే, కానీ ఎలా?

ఎలా ఎలా అనుకునే లోపల, వెనుక నుండి సీనియర్. ఏ నాన్న, జూనియర్ వా నువ్వు . పేరేంటి, ఊరేంటి, అంటు లక్ష ప్రశ్నలు. నా విషయాలు నీకెందుకు నాయినా, కావాలంటే ఆ అమ్మాయిని అడుగు ఈ ప్రశ్నలన్నీ, నేనూ చక్కగా ఆనందంతో వింటా. ఇలా మనసులో విసుగ్గా అనుకునే లోపల ఇంకో సీనియర్ . అబ్బా, అసలే గాలి ఆడట్లేదు, మళ్లీ వీళ్ళ గొడవ ఒకటి. మళ్లీ మొదటి నుంచి అన్నీ అడిగు బాబు!

ఇంతలో అతనికి ఏమయిందో ఏమో, నన్ను వెళ్లి ఆ అమ్మాయి పేరు బయోడేటా కనుక్కొని రమ్మన్నాడు. బయోడేటానా? అంటే ఏమేమి అడగాలి? వీళ్ళని అడిగితే ఇంక నన్ను ఆడుకుంటారు, అడగకపోతే అది, ఇది అడగలేదా అని మళ్లీ పంపిస్తారు. ఇదేదో బాగుండే, అన్నీ అడగకపోతే ఏంటి, మళ్ళి కలవచ్చుగా ఆ అమ్మాయిని. గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళాను.

నేను : మీ పేరు కొంచం చెప్తారాండి?
అమ్మాయి : నా పేరా , నీకెందుకు చెప్పాలి?
నేను : సీనియర్లు అడగమన్నారండి ? చెప్పకపోతే నన్ను ఆడుకుంటారు మరి.
అమ్మాయి : నేను చెప్పను. అతన్నే రమ్మను ధైర్యముంటే.
(నాకా? తనకా? అంత లేదమ్మా నాకు. పేరు చెప్తే ఈ అమ్మాయి సొమ్ము ఏమ్పోతుందో. ఇలా కాదు, నలుగురు సీనియర్ అమ్మాయిలు ర్యాగింగ్ చేస్తే కానీ ఈ అమ్మాయికి ర్యాగింగ్ అంటే తెలియదు)
నేను : ప్లీజ్ అండి , కొంచెం పేరు , ఊరు , బ్రాంచ్ చెప్పండి. నేనూ వెళ్ళిపోతాను.
అమ్మాయి : సరే, పేరు ఐశ్వర్య రాయి , ఊరు మంగళూరు , బ్రాంచ్ మీది కాదు. ఇలాగే చెప్పు అంది.
నేను : ఇలాగే చెప్పేదా అండి , రాయి గారు? కొంచెం అర్థం చేసుకోండి.
రాయి : (నవ్వుకుంటూ) ఆ ఇలానే చెప్పు
నేను : ప్లీజ్ అండి, చెప్పండి మళ్లీ మిమ్మల్ని కుడా ఆడుకుంటారేమో
రాయి : ఆ అప్పుడు చెప్పచ్చులే, ఇక నువ్వు వెళ్లచు.

ఏమి చేసేది లేక తిరుగుముఖం పట్టా. ఓ రాయి, భలే ఉన్నావనుకున్నా , నన్ను ఇలా ఇరికించేసావు కదా! ఈ సీనియర్ మహానుభావులు ఇక ఏంచేస్తారో చూడాలి!

Sunday, March 8, 2009

ఆడువారి దినం

ఈ రోజు ఆడవాళ్ల దినం (Women's Day) అంటండి. సంవత్సరం లో మిగతా రోజులన్నీ మగవారి దినాలేమో మరి. అబ్బాయిలు మీరు అలా అనుకుంటూ తృప్తి పడిపోండిక.

నాకు తెలిసి మహిళలకి అని ఒక దినం పదేళ్ళ ముందు లేదు. మొదట "Ponds" ప్రకటనలలో చూసా. ఒహొ భలే ఉందే, అమ్మాయిలకు దగ్గరవడానికి మంచి కిటుకే అనుకున్నా. అప్పటి నుంచి ప్రతి ఏడాది జరుపుకోవడం మొదలు పెట్టారు.
ఎంత ఆయినా మహిళలు తెలివయిన వారే! వాళ్ళకి కావాల్సిన బహుమతులను కొనిచ్చేసుకోదానికి ఇంకో రోజు దొరికింది. ఈ అంగడి వాళ్లు వారికి తగ్గట్టే స్పెషల్ ఆఫర్స్ అంటు వాళ్ళని మురిపించేస్తారు.

ఏమయితేనేం! ఈ స్త్రీల దినం సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజెస్తూ వారు ఆనందంగా ఉండాలని ఆకాంక్షిదాం.